గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (13:01 IST)

రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌బిల్ట్‌గానే 4జీ సిమ్?!

jiolaptop
దేశంలో టెలికాం విప్లవానికి శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... ఇపుడు మరో సంచలనానికి తెరతీయనుంది. 15 వేల రూపాయలకే రిలయన్స్ జియో ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఈ మేరకు రాయిటర్స్ తరహా పలు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ ల్యాప్ టాప్‌లో 4జీ సిమ్ ఇన్‌బిల్టుగానే రానున్నట్టు సమాచారం. అలాగే, ప్రత్యేకంగా జియో ఆపరేటింగ్ సిస్టమ్, జియో యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
ఈ ల్యాప్ టాప్‌లో 4జీ సిమ్ కార్డును ఇన్‌బిల్టుగా అమర్చనున్నారు. దీంతో ఎక్కడైనా మొబైల్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు లభించనుంది. అయితే ఈ ల్యాప్‌ టాప్‌ ధర, ప్రత్యేకతలపై స్పందించేందుకు జియో వర్గాలు నిరాకరించాయి. కానీ టెక్ వర్గాలు మాత్రం మరోలా స్పందిస్తున్నాయి. 
 
జియో ల్యాప్‌ టాప్‌‌ల కోసం రిలయన్స్‌ సంస్థ ఇప్పటికే మైక్రో ప్రాసెసర్‌‌ల తయారీ సంస్థ క్వాల్‌కమ్‌, ఆపరేటింగ్‌ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంటున్నాయి. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో అవసరానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన ‘జియో ఆపరేటింగ్‌ సిస్టం’తోపాటు జియోకు సంబంధించిన కొన్ని యాప్స్‌‌ను, ఇతర సదుపాయాలను జియో ల్యాప్‌ టాప్‌‌లో ముందే ఇన్‌ స్టాల్‌ చేసి అందించనున్నారు. అదనంగా అవసరమైన యాప్స్‌‌ను జియో స్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకుని ఇన్‌‌స్టాల్‌ చేసుకోవచ్చని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.
 
ఇప్పటికే రిలయన్ జియోకు దేశ వ్యాప్తంగా 40 కోట్లకుపై మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇపుడు జియో ల్యాప్ టాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ల్యాప్ టాప్‍‌లను తొలుత విద్యార్థులు, విద్యా సంస్థలకు అందజేసి ఆ తర్వాత బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులోకి ఉంచనున్నారని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.