గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (11:19 IST)

వాట్సాప్‌కు పోటీగా కేంద్రం కొత్త యాప్ రెడీ!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కేంద్రం త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్ నేతృత్వంలోని వాట్సాప్‌కు ధీటుగా సరికొత్త దేశీ యాప్‌ను లాంచ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ప్రైవరీ నిబంధనలతో వినియోగదారులు మరో ప్రత్యామ్నాయం కోసం యోచిస్తున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. 
 
సందేశ్ యాప్ యాప్ పేరుతో విడుదల కానున్న ఈ యాప్‌ను ఇప్పటికే కొందరు ప్రభుత్వాధికారులు టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై సందేశ్ యాప్ పనిచేస్తుందని చెబుతున్నారు. వాట్సాప్ మాదిరిగానే వాయిస్, డేటా సహా ఇతర సేవలను కూడా సందేశ్‌లో పొందుపర్చనున్నారు. 
 
లాగిన్ కోసం ఓటీపీ లేదా ఎల్‌డీఎపీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇతర మెసేజింగ్ యాప్‌ల మాదిరిగానే సందేశ్ కూడా మొబైల్, సిస్టమ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు.
 
అయితే ఈ యాప్‌ను కేవలం ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల కోసం మాత్రమే రూపొందించారా లేక సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతారా అన్ని ఇంకా తెలియరాలేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. 
 
కాగా వాట్సాప్‌కు ధీటుగా దేశీ ప్రత్యామ్నాయ యాప్‌ను తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టమ్ (జీఐఎంఎస్) పేరుతో ఈ యాప్ ఉండొచ్చని అప్పట్లో అధికార వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా దీనికి దేశీయ పేరు పెట్టినట్టు కనిపిస్తోంది. జీఐఎంఎస్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్లో కూడా సందేశ్ అనే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అధీకృత ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది