గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (17:43 IST)

18 ఏళ్లపాటు ఉచిత ఇంటర్నెట్‌ కోసం.. పుట్టిన బిడ్డకు ఆ పేరు పెట్టేశారు..?

కరోనా వచ్చాక.. శిశువులకు కోవిడ్, కరోనా, లాక్ డౌన్ అనే పేర్లు పెట్టడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. సాధారణంగా పుట్టిన బిడ్డకు వారికి ఇష్టమైన పేర్లో, కుటుంబంలోని పూర్వీకుల పేర్లో పెడుతుంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌కు తగినట్లు పేరు పెట్టడం చేస్తున్నారు. తాజాగా ఓ జంట ఉచిత ఇంటర్నెట్‌ కోసం తమ బిడ్డకు ఏకంగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ కంపెనీ పేరు పెట్టి అందర్నీ నివ్వెరపర్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్‌లో ట్విఫి అనే ఇంటర్నెట్‌ సర్వీస్‌ కంపెనీ ఉంది. ఎవరైతే వారి బిడ్డకు తమ కంపెనీ పేరు కలిసి వచ్చేలా ‘ట్విఫియస్‌’ లేదా ‘ట్విఫియా’ అని పేరు పెడతారో వారికి 18 ఏళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రకటనలో వెల్లడించింది. ఉచిత ఇంటర్నెట్‌ పొందాలంటే తల్లిదండ్రులు వారికి పుట్టిన బిడ్డ ఫొటో, జనన ధ్రువపత్రం ట్విఫి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 
 
వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేశాక వారి ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారట. చాలామంది ఉచిత ఇంటర్నెట్‌ కోసం బిడ్డకు అలాంటి పేర్లు ఎందుకు పెడతాం? అని ఊరుకున్నారు. కానీ, ఓ జంట మాత్రం ఆ ప్రకటనను సీరియస్‌గా తీసుకొని నిజంగానే ‘ట్విఫియా’ అని పేరు పెట్టేశారు. దీంతో ట్విఫి సంస్థ వారి ఇంటికి ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చింది. ముందు ప్రకటించినట్లుగానే 18 సంవత్సరాల పాటు ఇంటర్నెట్ సేవలు అందిస్తామని వెల్లడించింది.