సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (19:46 IST)

కరీంనగర్‌ విద్యార్థి అదుర్స్ - 'ట్రేస్ చాట్'కు గ్లూగుల్ ప్లే స్టోర్ ఆమోదం

trace chat
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ఒక మెస్సేజింగ్, ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాంను అభివృద్ది చేసి వార్తల్లో నిలుస్తున్నాడు కరీంనగర్‌కు చెందిన ఒక విద్యార్థి. 'ట్రేస్ చాట్' పేరుతో ఒక మెస్సెంజర్ యాప్‌ను రూపొందించాడు హుజురాబాద్‌కు చెందిన కన్నం అభి. 
 
14 ఏళ్ల ఈ యువ కెరటం ఈ సంవత్సరమే తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. అతడు అభివృద్ధి చేసిన సరికొత్త మీడియా షేరింగ్ ట్రేస్ చాట్ యాప్‌ను ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ కూడా ఆమోదించింది. స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లు ట్రేస్ చాట్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ మాదిరిగా వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. 
 
వివిధ రకాల డాక్యుమెంట్లను పంపవచ్చు. అధిక నాణ్యతతో ఉండే వీడియో, ఆడియో కాల్‌లు ఈ యాప్‌ ప్రత్యేకతలు. ఈ యాప్‌కు ప్రత్యేక ఫీచర్లను జోడించే సపోర్టింగ్ యాప్‌ను సైతం అభి అభివృద్ది చేశాడు. అతడు ప్రత్యేకంగా ట్రేస్ వాల్‌పేపర్ హెచ్‌డి యాప్‌ను డిజైన్ చేశాడు. దీన్ని కూడా ప్లే స్టోర్ ఆమోదించింది. 
 
16 వేర్వేరు విభాగాల్లో 500కి పైగా వాల్‌పేపర్‌లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. యాప్ యూజర్లు వాల్‌పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు వాటిని ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్లే స్టోర్‌లో ట్రేస్‌చాట్ యాప్ ఇప్పటికే 100కు పైగా డౌన్‌లోడ్‌లు సాధించింది. ఇది 4.8 రేటింగ్‌తో దూసుకుపోతోంది. 
 
అభి హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందినవాడు. అతడి తండ్రి శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి పూజ గృహిణి. వేసవి సెలవుల్లో యూట్యూబ్, ఇతర సోర్స్‌ సహాయంతో యాప్‌ను డెవలప్ చేశానని అభి చెబుతున్నాడు. కేవలం 45 రోజుల్లోనే ఈ యాప్‌ను తీర్చిదిద్దానని అతడు వివరిస్తున్నాడు.