గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:48 IST)

పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందా?

ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రస్తుత సిఈఓ సుందర్ పిచాయ్ మన భారతీయుడు. గూగుల్ యాజమాన్యం మాత్రం అనేకమందిని, అనేక రకాలుగా పరీక్షించి ఏరికోరి మరీ పిచాయ్‌ను సిఈఓగా నియమించింది. అయితే ఇప్పుడు ఈ భారతీయ నాయకుడిపై నమ్మకం సన్నగిల్లుతోందట. అయితే ఆ అపనమ్మకం వేరే ఎవరికో కాదు గూగుల్ ఉద్యోగులకేనట.
 
వివరాల్లోకి వెళితే గూగుల్ సంస్థ ప్రతి ఏడాది అనేక అంశాలపై తమ సంస్థలోని ఉద్యోగుల అభిప్రాయాలను సేకరిస్తుంది. దీని కోసం గూగులెగిస్ట్ పేరుతో వార్షిక పోల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సుందర్ పిచాయ్ పనితీరు గురించి ఆయన నాయకత్వంలో సంస్థ మరింత ముందుకు వెళ్తుందా అన్న ప్రశ్నకు 78 శాతం మంది అవును అని తెలిపారు, అయితే ఇదే ప్రశ్నకు గతేడాది 88 శాతం మంది అనుకూలంగా ఓటువేసారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం ఉద్యోగుల్లో పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లినట్లు సమాచారం.
 
పిచాయ్ తీసుకునే నిర్ణయాలు వ్యూహాలు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయనే దానికి బదులుగా 75 శాతం మంది అనుకూలంగా స్పందించారు... అయితే గతేడాదితో పోల్చితే ఈ విషయంలో కూడా 13 శాతం మంది అపనమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. రోజురోజుకీ తనపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో పిచాయ్ తన సంస్థ భవిష్యత్తు కోసం ఏవైనా సంస్కరణలు చేపడతాడో లేదో వేచి చూడాలి.