అందుబాటులోకి ఈ-సిమ్ కార్డులు - వాటి ప్రయోజనాలేంటి?
దేశీయ టెలికాం రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్తుతోంది. ఫలితంగా కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పెద్ద పరిమాణంలో ఉండే సాధారణ సిమ్ కార్డుల స్థానంలో మైక్రో సిమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు కొత్తగా ఈ-సిమ్ కార్డులు రానున్నాయి. ఇలాంటి సిమ్ కార్డులను అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు అందజేస్తున్నాయి.
ముఖ్యంగా, దేశంలో మొబైల్ టెలికాం సేవలు అందిస్తున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలాంటి టెలికాం ఆపరేటర్లు ఈ ఇ-సిమ్ కార్డు సౌకర్యాన్ని ఇస్తున్నాయి. చాలా మంది యూజర్లకు ఇంకా ఈ ఇ-సిమ్ కార్డు గురించి తెలియదు. అయితే దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
ఈ-సిమ్ అంటే ఎలక్ట్రానిక్ లేదా ఎంబెడెడ్ సిమ్. దీని ద్వారా భౌతికంగా సిమ్ అవసరం లేకుండానే టెలికాం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ-సిమ్‌కు సపోర్ట్ చేసే డివైస్‌లలోనే ఇది పని చేస్తుంది. ఈ డివైస్‌లలో ఈ-సిమ్ ప్రొఫైల్‌ను డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒక డివైస్‌లో ఎన్నో ఈ-సిమ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నా.. ఒక సమయంలో ఒక ఈ-సిమ్ ప్రొఫైల్ మాత్రమే పని చేస్తుంది.
ఒకవేళ సిమ్ కార్డులను బయటకు తీయలేని డివైస్‌లైతే ఫోన్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా మీరు సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకోవచ్చు. ఒకవేళ అంతర్జాతీయంగా ప్రయాణిస్తుంటే మీరు సులువుగా ఈ-సిమ్ కార్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్టోర్‌కు వెళ్లి, ప్రత్యేకంగా సిమ్ కార్డు కొనాల్సిన అవసరం ఉండదు. దీంతో సమయం ఆదా అవుతుంది. ఈ-సిమ్‌ను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.