గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (11:43 IST)

ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే.. ఖాతాలను తొలగిస్తాం.. వాట్సాప్

వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తన వాదనలు కోర్టుకు వినిపించారు. 
 
వాట్సాప్ ప్రైవసీ పాలసీని వాయిదా వేసే ప్రసక్తే లేదని, ఒకవేళ ఎవరైనా వాట్సాప్ ప్రైవసీ పాలసీని అంగీకరించనట్టయితే వారి వాట్సాప్ ఖాతాలను దశలవారీగా తొలగించనున్నట్టు వాట్సాప్ తేల్చిచెప్పింది.
 
కేంద్రం తరపున ఢిల్లీ హై కోర్టులో వాదనలు వినిపించిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాట్సాప్ పిటిషన్‌పై స్పందిస్తూ.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
 
ఇదే విషయమై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వాట్సాప్ సీఈఓకు కేంద్రం ఓ లేఖ రాసిందని, సీఈఓ నుంచి రిప్లై కోసం వేచిచూస్తున్నామని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. 
 
అయితే వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఐటి యాక్టు 2000 నాటి చట్టాన్ని ఉల్లంఘిస్తోంది అనే ఆరోపణలపై వాట్సాప్ తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ సహ న్యాయవాది అర్వింద్ దతర్ ఖండించారు. అన్ని ఐటి రూల్స్ అనుసరించే వాట్సాప్ ప్రైవసీ పాలసీ రూపొందించడం జరిగింది అని అర్వింద్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో ఇరువురి వాదనలు విన్న ఢిల్లీ హై కోర్టు.. పిటిషన్ విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.