మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (08:52 IST)

"నమో" నారాయణ : మళ్లీ కమల వికాసమే... తేల్చిన ఎగ్జిట్ పోల్స్

సార్వత్రిక ఎన్నికల ఫలిల పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఆ తర్వాత ప్రముఖ టీవీ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. వీటిలో ప్రతి ఒక్కటీ బీజీపీకే మద్దతు తెలిపాయి. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అన్న నరేంద్ర మోడీ పిలుపునకు దేశ ఓటర్లంతా ఆకర్షితులైనట్టు తెలుస్తోంది. ఫలితంగా మరోమారు మోడీ సర్కారుకు అవకాశం ఇస్తున్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి. 
 
పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వెల్లడించాయి. వీటిలో ప్రతి ఒక్కటీ బీజేపీకి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టాయి. కానీ, ఒక్క నేత - న్యూస్ ఎక్స్, ఏబీపీ నీలన్స్ సంస్థలు మాత్రం ఎన్డీయేక్ కనీస మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టాయి. మిగిలిన సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి 300 ప్లస్ మార్కు దాటేస్తుందని అంచనాలు వేశాయి. 
 
ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి. దేశంలోని 543 స్థానాలకు గానూ 542 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏడో దశ పోలింగ్‌ ముగిసిన వెంటనే వివిధ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి. 
 
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా.. కూటమికైనా 272 సీట్లు రావాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు సాధించగా.. ఎన్డీయే కూటమికి 336 సీట్లు వచ్చాయి. మోడీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా దాదాపు ఇటువంటి ఫలితాలనే ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు అంచనా వేయడం విశేషం. 
 
తద్వారా.. ప్రభుత్వ వ్యతిరేకత అస్సలు ఏమాత్రం లేదని, కాంగ్రెస్‌ లేశమాత్రం కూడా పుంజుకోలేదని, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ సునామీ కొనసాగుతోందని సర్వే సంస్థలు ప్రకటించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా టుడేస్‌ చాణక్య ఒక్కటే వాస్తవానికి దగ్గరగా ఎన్డీయేకు 340 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇప్పుడు అదే సంస్థ ఎన్డీయేకు ఏకంగా 350 సీట్లు (14 సీట్లకు అటు ఇటు) వస్తాయని ప్రకటించడం గమనార్హం.
 
గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీకి ఈసారి ఏకంగా 300 (14 సీట్లకు అటు ఇటు) స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక, ఇండియా టుడే (ఆజ్‌ తక్‌ యాక్సిస్‌ మై ఇండియా) కూడా ఎన్డీయేకు 339 నుంచి 365 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 'నేత- న్యూస్‌ ఎక్స్' సంస్థ ఎన్డీయేకు 242 సీట్లు మాత్రమే వస్తాయని, యూపీఏ 164 స్థానాలు సాధిస్తాయని పేర్కొంటే.. ఏబీపీ నీల్సన్‌ ఎన్డీయేకు 267, యూపీఏకు 130 సీట్లు వస్తాయని తెలిపింది. 
 
యూపీఏ 150 సీట్లు దాటుతుందని ప్రకటించిన సంస్థ కూడా 'నేత-న్యూస్‌ ఎక్స్' మాత్రమే కావడం గమనార్హం. అంతేనా, మిగిలిన తటస్థ పార్టీలన్నిటికీ కలిపినా 150 సీట్లు దాటవని అత్యధిక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇక, ఎన్డీయే ఓట్ల శాతం పెరగనుందని అత్యధిక సర్వే సంస్థలు తెలిపాయి. గత ఎన్నికల్లో ఎన్డీయే ఓట్ల శాతం దాదాపు 39 శాతం కాగా.. ఈసారి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది 49 శాతానికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషించాయి. 
 
అలాగే, గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ అత్యంత స్వల్పంగానే పుంజుకోనుందని అంచనా వేశాయి. ఇక, యూపీఏకు వంద సీట్లు కూడా దాటవని మూడు సర్వే సంస్థలు చెబితే.. మిగిలినవి 132 లోపు సీట్లనే కట్టబెట్టాయి.