ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:10 IST)

కైలాస పర్వతమంతటి అద్భుత ప్రదేశం కావాలన్న పార్వతీదేవి: పరమేశ్వరుడు ఏం చేసాడో తెలుసా?

కైలాస పర్వత వైభవం ఎలా వుంటుందో ఎన్నో గ్రాంథాలలో చూసాము. అలాంటి అద్భుతమైన కైలాస పర్వతం పార్వతీ దేవికి ఎంతో ఇష్టమైన ప్రదేశం. పరమేశ్వరుడు సృష్టించిన విశ్వంలో కైలాసం కాకుండా తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం మరొకటి కావాలని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని అడిగింది.

 
అప్పుడు శివశంకరుడు... సుందరమైన ప్రకృతి మధ్య నెలకొని ఉన్న శాశ్వతమైన అందమైన ప్రదేశం, శ్రీ చక్ర అవతారం, పవిత్రమైన స్థలం శ్రీశైలం ఎంచుకున్నాడు. ఇక్కడ శివ-శక్తి ఇద్దరూ భక్తులందరినీ ఆశీర్వదించడానికి శ్రీ మల్లికార్జున స్వామి- భ్రమరాంబ రూపంలో వేంచేసారు.

 
పురాణాలలో పేర్కొన్నట్లు శ్రీశైలానికి గొప్ప ప్రాచీన ప్రాముఖ్యత ఉంది. 12 జ్యోతిర్లింగాలలో రెండవది మల్లికార్జున స్వామి లింగం. 18 మహా శక్తి పీఠాలలో ఆరవది శ్రీ భ్రమరాంబ దేవి ఆలయం. ఒకే ఆలయ ప్రాంగణంలో అలాంటి రెండు చిహ్నాలు ఉన్న ఏకైక ఆలయం శ్రీశైలం. శ్రీశైలానికి శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వతం, శ్రీనాగం వంటి అనేక ఇతర పేర్లు ఉన్నాయి.

 
సత్యయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో సీతాదేవితో పాటు శ్రీరాముడు, ద్వాపరయుగంలో ఐదుగురు పాండవులు, కలియుగంలో ఎందరో యోగులు, ఋషులు, మునులు, ప్రబోధకులు, ఆధ్యాత్మిక గురువులు, రాజులు, కవులు, భక్తులు శ్రీశైలాన్ని దర్శించి శ్రీ భ్రమరాంబిక దేవి, మల్లికార్జునుల అనుగ్రహం పొందారు.