సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (13:39 IST)

ఉత్తరాఖండ్ ఉప్పెన మృతులు 14 .. కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడటంతో సంభవించిన జలప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14కు చేరింది. ఈ ప్రళయంలో దాదాపు 150 మందివరకు గల్లంతైనట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో 14 మంది చనిపోగా, మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో మంచు చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల‌ గంగానది ఉపనదులైన అల‌క‌నంద‌, దౌలీగంగా న‌దుల్లో భారీ వ‌ర‌ద వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆదివారం సంభవించిన ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 14కు చేరుకున్న‌ది. 
 
ఉత్త‌రాఖండ్ ఉప్పెన‌లో రిషిగంగా, ఎన్‌టీపీసీ ప‌వ‌ర్ ప్లాంట్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జోషీమ‌ఠ్ వ‌ద్ద ఉన్న త‌పోవ‌న్ ట‌న్నెల్‌ను ఐటీబీపీ జ‌వాన్లు శుభ్రం చేస్తున్నారు. 
 
ట‌న్నెల్‌లో భారీ స్థాయిలో వ‌ర‌ద‌మ‌ట్టి కూరుకుపోయింది. తపోవ‌న్ ట‌న్నెల్ ప్ర‌వేశం వ‌ద్ద ఉన్న బుర‌ద మ‌ట్టిని తొల‌గించేందుకు ఆర్మీ సిబ్బంది క‌ఠోరంగా శ్ర‌మించారు. ఇంజ‌నీరింగ్ టాస్క్ ఫోర్స్ ద‌ళాలు కూడా ఈ ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి. 
 
భారీ జేసీబీల‌తో ట‌న్నెల్ వ‌ద్ద ఉన్న మ‌ట్టిని రాత్రంతా తొల‌గించారు. జ‌న‌రేట‌ర్లు, సెర్చ్ లైట్లు పెట్టి మ‌రీ ప‌నిచేశారు. సుమారు 80 మీట‌ర్ల దూరం మేర ట‌న్నెల్‌ను క్లీన్ చేసిన‌ట్లు ఐటీబీపీ డీఐజీ అప‌ర్ణా కుమార్ తెలిపారు. 
 
జేసీబీల‌తో మ‌ట్టిని తొల‌గిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. సుమారు 180 మీట‌ర్ల పొడుగు ఆ ట‌న్నెల్ ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. ట‌న్నెల్ లోప‌ల క‌నీసం 40 మంది వ‌ర‌కు కార్మికులు ఉండి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు. వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు.