జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల హతం.. ఏకే 47, ఆయుధాలు స్వాధీనం
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న తరుణంలో.. ఉగ్రవాదులు మాత్రం అకృత్యాలకు పాల్పడుతున్నారు. సరిహద్దుల వద్ద అటు పాకిస్థాన్, ఇటు చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న తరుణంలో జమ్ము కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు.
దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఈ ఘటన ఉత్తర కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. నౌగామ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
కుప్వారా జిల్లా బారాముల్లా సమీపంలని నౌగామ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద శనివారం తెల్లవారు జామున ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయని ఆర్మీ పీఆర్‌ఓ ప్రకటించారు. దీంతో వారిపై కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. వారివద్ద రెండు ఏకే 47 తుపాకులు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.