శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:50 IST)

కరోనా సోకడంతో ఉద్యోగం నుంచి తొలగింపు.. సూసైడ్ చేసుకున్న జర్నలిస్టు

కరోనా సోకిందన్న కారణంతో ఉద్యోగిని ప్రముఖ పత్రిక ఉద్యోగం నుంచి తప్పించింది. దీంతో దిక్కుతోచని ఆ జర్నలిస్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రికలో తరుణ్ సిసోడియా అనే యువకుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఇదేసమయంలో వైరస్ బారిన పడ్డాడన్న కారణంతో అతన్ని పత్రిక యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసేసినట్టు తెలిసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన అతను, ఎయిమ్స్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. చికిత్స పొందుతూ అతను మరణించాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.