శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (13:06 IST)

ట్రక్కులో దాగిన ఉగ్రవాదులు.. మట్టుబెట్టిన భద్రతా బలగాలు

జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ట్రక్కులో ఉన్న ఉగ్రవాదులను గుర్తించిన భారత భద్రతా బలగాలు వారిని హతమార్చాయని అక్కడి పోలీసులు తెలిపారు.
 
శ్రీనగర్‌ వైపు వెళ్తున్న ట్రక్కును తనిఖీ నిమిత్తం భద్రతా సిబ్బంది ఆపడానికి ప్రయత్నించారు. దీంతో అందులోని ఉగ్రవాదులు ఆటోమెటిక్ ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడడంతో వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌‌కు తీవ్రగాయాలయ్యాయి.
 
మరోవైపు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌ధుర జిల్లాలో జాతీయ ర‌హ‌దారిపై ఒంట‌రిగా ప్ర‌యాణించేవారే ల‌క్ష్యంగా దోపిడీల‌కు, హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మ‌ధుర‌లోని మూడు పోలీస్‌స్టేష‌న్‌ల‌కు సంబంధించిన పోలీసులు ఐదు బృందాలుగా ఏర్ప‌డి ఈ ముఠా ఆట‌క‌ట్టించారు. 
 
జ‌మునా పార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి మావ‌ళి గ్రామంలోని కళ్యాణ్‌పురి మూడు రోడ్ల కూడ‌లి వ‌ద్ద ఈ గ్యాంగ్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు.. రౌండ‌ప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా పోలీసులు, నేర‌స్థుల‌కు మ‌ధ్య స్వ‌ల్ప ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ధ‌ర్మేంద్ర‌, స‌చిన్ అనే ఇద్ద‌రు నేర‌స్థులు గాయ‌ప‌డటంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు. శివ‌మ్ అనే మ‌రో నేర‌గాడిని పోలీస్‌స్టేష‌న్‌లో పెట్టారు. 
 
మధుర‌లోని జాతీయ ర‌హ‌దారి వెంట‌ వేర్వేరు ప్ర‌దేశాల్లో వేర్వేరు తేదీల్లో మూడు హ‌త్య‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో స్థానికంగా ఉండే మూడు పోలీస్‌స్టేష‌న్‌ల పోలీసులు జాయింట్ ఆపరేష‌న్ చేప‌ట్టి ఎట్ట‌కేల‌కు నేర‌స్థుల‌ను అరెస్టు చేశారు.