చేతులెత్తేసిన బీజేపీ... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేతులెత్తేసింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించే విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
తొలుత బీజేపీకి ఆహ్వానం పంపగా, ఆ పార్టీ నిరాకరించింది. ఇపుడు శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించారు. ఒకవేళ ఆ పార్టీ కూడా చేతులు ఎత్తేస్తే ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే, రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అహ్వానిస్తారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరూ ముందుకు రాకుంటే రెండో అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ఆహ్వానిస్తారు.
ఆహ్వానం మేరకు వచ్చిన పార్టీ లేదా కూటమిని అసెంబ్లీలో బలనిరూపణలో గెలువగలరా? అని గవర్నర్ అడుగుతారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటములుగానీ, ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడిన పార్టీలుగానీ ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నామని లిఖితపూర్వకంగా గవర్నర్‌కు రాసిఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ ఏ పార్టీగానీ, కూటమిగానీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు గవర్నర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి నివేదిక పంపుతారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. సిఫారసును రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది.