శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:29 IST)

రాజస్థాన్ మంత్రి హరీశ్‌ చౌదరికి కొత్త పగ్గాలు.. అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీ?

రాజస్థాన్ మంత్రి హరీశ్‌ చౌదరికి సరికొత్త బాధ్యతలను కాంగ్రెస్‌ అధిష్టానం అప్పగించింది. పంజాబ్‌లో ఇటీవల జరిగిన పరిణామాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, రాష్ట్ర నాయకుల మధ్య వారధిగా వ్యవహరించిన ఆయనను పంజాబ్‌ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్‌గా నియమించింది. 
 
హరీశ్‌ రావత్‌ స్థానంలో హారీశ్‌ చౌదరికి ఈ కొత్త బాధ్యతలను ఇచ్చింది. పిసిసి మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు, ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సన్నీల మధ్య ఏర్పడ్డ పొరపచ్చాలకు వాస్తవిక రూపాన్ని ఇచ్చేందుకు చౌదరి శనివారం చండీఘర్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. అమరీందర్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన తర్వాత, చన్నీని సిఎంగా ఎన్నుకోవడంలో చౌదరి కీలక పాత్ర పోషించారు.
 
మరోవైపు పంజాబ్‌లో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా...? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉండను.. బిజెపిలో చేరనూ అని చెప్పిన పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన అమరీందర్‌ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో తన నూతన పార్టీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తనకు మద్దతునిచ్చే వారితో సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. సిద్ధు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారూ... తనకు అనుకూలురుతో ఆయన చర్చలు జరుపుతున్నారని, ఒక వేళ పార్టీని ఏర్పాటు చేస్తే... వీరంతా కూడా పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.