పంజాబ్‌లో కీలక పరిణామం... పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా
పంజాబ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేందుకు హస్తినకు వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
నిజానికి వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.
తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు.
పంజాబ్‌లో సిద్దూ వర్సెస్ కెప్టెన్ అమరీందర్ సింగ్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. సిద్దూతో దేశానికి ముప్పు ఉందని, అతనికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
అదేసమయంలో ఇపుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.