పౌరసత్వ సవరణ బిల్లు ప్రకంపనలు : అస్సోంలో కేంద్రమంత్రి ఇంటిపై దాడి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా, అస్సోంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు మొదలై తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అప్పటికీ శాంతించని ఆందోళనకారులు అస్సోం రాష్ట్రమంత్రితో పాటు... కేంద్ర మంత్రి నివాసాలపై దాడి చేశారు.
డులియాజన్‌లో ఉన్న కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి నివాసంపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈయన డిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ, కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.
తేలి నివాసంపై దాడి జరగక ముందే ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ నివాసంపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్, ఆ పార్టీ నేత సుభాష్ దత్తా నివాసాలపై కూడా దాడికి తెగబడ్డారు.
మరోవైపు, ఆందోళనలతో అట్టుడుకుతున్న అసోంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఈ బిల్లుకు సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. కాగా, ఈ బిల్లుకు బుధవారం ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే.