ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (09:41 IST)

అయోధ్యకు వాహనాల రాకపోకలపై నిషేధం.. ఎందుకో తెలుసా?

ayodhya devotees crowd
అయోధ్యకు వాహనాల రాకపోకలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నియంత్రణ ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా, అన్ని వాహనాలకు ఆన్‌లైన్ బుకింగ్స్‌ను రద్దు చేసింది. అయోధ్యకు భక్తుల తాడికి ఒక్కసారిగా పెరిగిపోవడంతో భద్రత కూడా అత్యంత సవాల్‌గా మారింది. దీంతో ఊపీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. 
 
అయోధ్యలో సోమవారం బాల రాముడు కొలువుదీరాడు. ఆ మరుసటి రోజైన మంగళవారం నుంచి బాల రాముడిని చూసేందుకు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. తొలి రోజే ఏకంగా ఐదు లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శనం చేసుకున్నట్టు అంచనా వేశారు. దీంతో అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలు మారాయి. 
 
దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు వెళ్లే వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అయోధ్యకు వచ్చే అన్ని వాహనాలను మరికొన్ని రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ జరగగా మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా ఏర్పాట్లకు సవాలుగా మారింది. 
 
దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. రద్దీని గమనించిన ఆయన అయోధ్య వచ్చే యాత్రికుల రాకపోకలను నియంత్రించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. దీంతో రానున్న కొన్ని రోజులపాటు అయోధ్యకు వెళ్లే అన్ని వాహనాలపై నిషేధం విధించాలని అధికారులు నిర్ణయించారు. వాహనాలకు సంబంధించి అన్ని ఆన్‌లైన్ బుకింగ్‌లను సంబంధించిన బుకింగ్ ఛార్జీలను రీఫండ్ చేస్తామని తెలిపారు. కాగా మంగళవారం ఉదయం నుంచి సామాన్య భక్తులకు బాల రాముడి దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే.