శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:28 IST)

బెంగాల్‌లో అరాచకం : జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ళదాడి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. ముఖ్యంగా, బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు పాల్పడుతున్నారు. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న సభలో కూడా టీఎంసీ కార్యకర్తలు అల్లకల్లోలం సృష్టించిన విషయం తెల్సిందే. ఇపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ళతో దాడికి తెగబడ్డారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన జేపీ నడ్డా 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ ప్రాంతానికి వెళుతుండగా ఓ సమూహం ఆయన కాన్వాయ్‌పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. కొందరు వ్యక్తులు పెద్ద ఇటుకల సైజులో ఉన్న రాళ్లను వాహనాలపైకి విసిరారు. ఈ మేరకు ఓ వీడియోలో వెల్లడైంది. 
 
ఈ దాడిపై బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ రాగా, ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆ లేఖలో పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. బుధవారం సాగిన జేపీ నడ్డా పర్యటనలో పోలీసులే కనిపించలేదని తెలిపారు.