అడ్డొస్తే కాళ్లూచేతులు నరికేస్తాం.. మాట వినకుంటే చంపేస్తాం : బెంగాల్ బీజేపీ చీఫ్
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏదో రూపంలో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీ (బీజేపీ) దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా, ఆ పార్టీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ ఉద్వేగపూరిత ప్రసంగాలతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అదేసమయంలో విపక్ష పార్టీల కార్యకర్తలకు బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు.
తాజాగా ఆయన చేసిన హెచ్చరిక ఇపుడు వివాదాస్పదంగా మారింది. తమ పార్టీ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తే కాళ్లు, చేతులు నరికేస్తామని, అయినా వినకపోతే చంపుతామని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రాష్ట్రంలో బీజేపీ ర్యాలీలు నిర్వహిస్తున్నది.
ఇందులోభాగంగా ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, పార్టీ కార్యకలాపాలకు ఇబ్బందులు సృష్టిస్తున్న దీదీ మద్దతుదారులు తమ పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. లేనట్లయితే దవాఖానలకు వరుసకట్టాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కువ చేస్తే కాళ్లు, చేతులు విరిచేస్తామన్నారు. అప్పటికీ దారికిరాకపోతే శ్మశానానికి వెళ్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఇటీవల కేంద్రం హోం మంత్రి అమిత్ షా బెంగాల్‌లో పర్యటించారు. ఆ తర్వాత స్థానిక నేతలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. షా పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత దిలీప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని 294 సీట్లలో 200 స్థానాలు గెలుపొందాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు.