సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (18:34 IST)

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

Justice Statue
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తులను సవరణ చేశారు. కోర్టులు, లీగల్ చాంబర్లు, సినిమాలలో కళ్లకు గంతలు కట్టి కనిపించే న్యాయ దేవత విగ్రహాన్ని సరికొత్త రూపునిచ్చారు. కళ్లకు కట్టిన గంతలను సుప్రీంకోర్ట్ తొలగించింది. అంతేకాదు న్యాయ దేవత ఒక చేతిలో ఉండే స్థానంలో రాజ్యాంగ ప్రతిని ఉంచింది. బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు.
 
భారతీయ న్యాయవ్యవస్థ చిహ్నానికి కొత్త రూపును తీసుకురావడమే లక్ష్యంగా ఈ కీలక మార్పులు జరిగాయి. తద్వారా 'చట్టం ఇకపై గుడ్డిది కాదు' అని సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయింది. ఈ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చొరవ చూపించారు. మార్పుల అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
 
కాగా మునుపటి న్యాయ దేవత విగ్రహం ఒక చేతిలో శిక్షకు చిహ్నంగా ఖడ్గం ఉండేది. దాని స్థానంలో అందరికీ సమానత్వాన్ని అందించే రాజ్యాంగ ప్రతిని ఉంచారు. వలస వారసత్వాన్ని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన తరుణం ఇదని సీజైఐ డీవై చంద్రచూడ్ భావించారని సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి. ‘చట్టం గుడ్డిది కాదు. అందరినీ సమానంగా చూస్తుంది” అని ఆయన అన్నారని సమాచారం. అందుకే న్యాయ దేవత కొత్త రూపంలో ఈ సూత్రం ప్రతిబింబించేలా చూసుకున్నారు.