గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (10:49 IST)

మద్యం అక్రమ రవాణాలో పట్టుబడిన శునకం - 12 రోజులుగా రిమాండ్

dog
మద్యం అక్రమ రవాణాలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ శునకం పట్టుబడింది. దీనికి కోర్టు రిమాండ్‌ విధించింది. ఫలితంగా గత 12 రోజులుగా ఇది రిమాండ్‌లో ఉంది. పైగా ఇది జర్మన్ షెపర్డ్ జాతి శునకం. దీనికి మూడు పూటల ఆహారం పెట్టలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. స్టేషన్‌లో పని చేసే పోలీసు సిబ్బంది చందాలు వేసుకుని ఈ కుక్కకు ఆహారం అందిస్తున్నారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల ఆరో తేదీన బీహార్ రాష్ట్రంలోని బక్సర్‌ జిల్లా ఘాజీపుర్‌ వద్ద పోలీసులు అక్రమ మద్యం తరలిస్తున్న ఓ కారును పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో.. ఓ కారులో విదేశీమద్యం తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని జైలుకు పంపారు. కానీ, కారులో జర్మన్‌ షెపర్డ్‌ కుక్క కూడా ఉండటంతో దానిని కూడా అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు.
 
ఏం ఆలోచించి పోలీసులు కుక్కను అదుపులోకి తీసుకున్నారో తెలియదు గానీ.. ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కుక్క రోజువారీ ఖర్చులు భారీగా ఉన్నాయి. స్టేషన్‌ సిబ్బంది తలా కొంత చందాలు వేసుకొని.. కుక్కకు ఆహారం పెడుతున్నారు. ఈ మర్యాదలు ఏమాత్రం తగ్గినా.. గట్టిగా మొరిగి అందరినీ ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆ కుక్కను తీసుకువెళ్లాలని యజమానిని పోలీసులు వేడుకొంటున్నారు. 
 
దీనిపై బక్సర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, ఈ కుక్కకు రోజూ ఆహారం పెట్టలేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. దానికి రోజూ పాలు, మొక్కజొన్న పెట్టాల్సి వస్తోందన్నారు. అది ఆంగ్లంలో ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటిస్తోందని, హిందీలో చెబితే వినడం లేదని పేర్కొన్నారు. అది తినే టైమింగ్, ఏం తింటుందో తెలియకపోవడం ఇబ్బందిగా మారిందని ఆయన అన్నారు.