బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (20:01 IST)

16 వేల మంది రోగులకు గుండె ఆపరేషన్ చేసిన వైద్యుడు... గుండెపోటుతో మృతి

gaurav gandhi
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ(41) గుండెపోటుతో మరణించారు. దేశంలోనే ఎంతో పేరొందిన ఈ కార్డియాలజిస్ట్ ఇప్పటివరకు సుమారుగా 16 వేల మంది రోగులకు విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశారు. అలాంటి వైద్యుడు ఇపుడు గుండెపోటుతో మరణించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డాక్టర్ గౌరవ్ గాంధీ మంగళవారం ఉదయం గుండెపోటుతో చనిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌ ప్రాంతంలో ప్రముఖ కార్డియాలజిస్టుగా గుర్తింపు పొందారు. గుండె జబ్బులపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఆయన గురించి తెలియని వారు లేరు. సుమారు 16 వేల మందికి పైగా రోగులకు ఆయన గుండె ఆపరేషన్లు చేశారు. అలాంటి డాక్టర్‌ గాంధీ మృతివార్త రోగులు, ఆస్పత్రి వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
ఇటీవలికాలంలో యువకులు, మధ్య వయస్కులు ఎక్కువగా గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జామ్‌నగర్‌ ప్రాంతంలో గుండెకు సంబంధించిన రోగాలపై డాక్టర్ గాంధీ నిర్వహించిన కార్యక్రమాలను ఆయన వద్ద చికిత్స పొందినవారు గుర్తుచేసుకుంటున్నారు. 
 
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూలానే డాక్టర్‌ గాంధీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో తన పని ముగించుకొని ప్యాలెస్‌ రోడ్‌లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. రోజూ ఉదయం ఆరు గంటలకల్లా నిద్రలేచేవారని, మంగళవారం ఉదయం ఆరు గంటలు దాటినా.. లేవకపోవడంతో ఆయన్ను దగ్గరకు వెళ్లి పిలవగా స్పందించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. 
 
దీంతో ఆయన్ను కదిలించి చూడగా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలించామని.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్‌ గాంధీ మృతి గురించి పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన గుండెపోటుతో చనిపోవడం దురదృష్టకరమని అంటున్నారు.