ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (09:02 IST)

సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షలు రద్దు?

సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షలు రద్దవ్వనున్నాయా?.. దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందా?.. మంగళవారం ఆ మేరకు స్పష్టం చేయనుందా?..

అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల కొంత మంది తల్లిదండ్రులు  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విదేశాల్లో సీబీఎస్‌ఈకి అనుబంధంగా నిర్వహిస్తున్న దాదాపు 250 స్కూళ్లలో ఇప్పటికే పరీక్షలను రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇండియాలో కూడా పరీక్షలను రద్దు చేసి అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలని పలువురు తల్లిదండ్రులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు నానాటికీ పెరుగుతున్న కొవిడ్‌ కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు శ్రేయస్కరమనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా సీబీఎస్‌ఈ అధికారులను ఆదేశించింది.

పరీక్షలు రద్దు చేయడమా, వాయిదా వేయడమా అనే అంశంపై జూన్‌ 23లోగా తమ నిర్ణయం వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మరోపక్క కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సీబీఎ్‌సఈ, ఎన్‌టీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ నేపథ్యంలో జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు.

సీబీఎస్‌ఈతోపాటు ఈ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మంగళవారం వెల్లడించనున్నారు. కాగా, సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిసాలు కేంద్రాన్ని కోరాయి. మరికొన్ని రాష్ట్రాలు జేఈఈ, నీట్‌ పరీక్షలను సైతం రద్దు చేసి ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాయి.

అయితే ఇంజనీరింగ్‌, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షలను రద్దు చేస్తే దాని ప్రభావం ఏమేరకు ఉంటుందన్న దానిపైనా కేంద్రం ఆలోచిస్తోంది.