మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వొచ్చు.. కానీ, ఉద్యోగాలకు హాని కలుగుతుంది : సుప్రీంకోర్టు
మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వడం అనేది విధానపరమైన నిర్ణయమన్నారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. పైగా, మహిళలకు ఈ తరహా సెలవులు ఇవ్వడం వల్ల వారి ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మిగతా రాష్ట్రాలు కూడా దీనిని పాటించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ కోరారు.
ఈ పిల్‌ను సోమవారం విచారించిన కోర్టు.. నెలసరి సెలవులు ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను సమర్థిస్తూనే.. ఇది వారి ఉద్యోగావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలకు నెలసరి సెలవులు అనేది విధానపరమైన అంశమని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
నెలసరి సెలవులు ఇవ్వాల్సిందేనంటూ యాజమాన్యాలను బలవంతం చేస్తే మహిళలను నియమించుకునే విషయంలో పునరాలోచిస్తారని, ఇది వారి ఉద్యోగావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, దేశంలో కేరళ, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్న విషయం తెల్సిందే.