మరో ఉద్దీపన ప్యాకేజ్ కోసం కేంద్రం కసరత్తు
కరోనావైరస్‌తో కుదేలైన ఆర్థికవ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌పై కసరత్తు చేస్తోంది. “కోవిడ్-19” నేపథ్యంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఐదు నెలల కిందట “ఆత్మనిర్భర్” పేరుతో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించింది.
వృద్ధిని వేగవంతం చేసి ఆర్థిక వ్యవస్ధలో డిమాండ్‌ను ప్రేరేపించేందుకు ప్రభుత్వం మరో ప్యాకేజ్‌ను ప్రకటించాలని ఆయా రంగాల నుంచి వచ్చిన విజ్ఞాపనలతో కేంద్ర ప్రభుత్వం ఆదిశగా కసరత్తు చేస్తోంది. ఉద్దీపన చర్యల కోసం ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వశాఖలు, రంగాల నుంచి పలు సూచనలు, ప్రతిపాదనలు అందాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజ్ వెలువడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యాక్రమంలో సంకేతాలిచ్చారు. జీడీపీ తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వపరిస్థితిని మదింపు చేస్తోందని, మరో ఉద్దీపన ప్యాకేజ్‌కు అవకాశాలున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి సూచనప్రాయంగా తెలియజేశారు.
మరోవైపు ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 10.3 శాతం పతనమవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. వృద్ధికి ఊతమిస్తూ, మార్కెట్ డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను త్వరలో ప్రకటించవచ్చని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు.