1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (12:01 IST)

రేపు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు - ప్రమాదస్థలిలో ఎయిర్ చీఫ్

హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాతపడిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌ల అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. బుధవారం నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో వీరిద్దరితో పాటు మొత్తం 11 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రమాదస్థలి నుంచి 13 మంది మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వెల్లింగ్టన్ ఆర్మీ ట్రైనింగ్ క్యాంపులో పూర్తి సైనిక లాంఛలనాతో రక్షణ శాఖ ఉన్నతాధికారులు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇతర మంత్రులు, జిల్లా కలెక్టర్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత మృతులను వారివారి స్వస్థలాలకు రక్షణ శాఖ అధికారులు తరలించనున్నారు. 
 
అలాగే, బిపిన్ రావత్ దంపతుల భౌతికకాయాలను కూడా ఢిల్లీకి గురువారం సాయంత్రంలోపు తరలించారు. శుక్రవారం ఆయన నివాసానికి తీసుకెళ్లి కొద్దిసేపు సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ వేడుకలన్నీ పూర్తిగా సైనిక లాంఛలనాతో జరుగుతాయి. 
 
ఈ అంత్యక్రియల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, త్రివిధ దళాధిపతులు తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు సాగుతోంది. అలాగే, ప్రమాద స్థలిని భారత వైమానిక దళ అధిపతి వీఆర్ చౌదరి గురువారం సందర్శించారు.