శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (17:45 IST)

'బురేవి' తుఫాను వచ్చేస్తోంది.. 65కిమీ వేగంతో గాలులు.. అతి భారీ వర్షాలు

నివర్ తుఫాను ధాటికి తమిళనాడు, ఏపీల్లోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. నివర్ తుఫాను తర్వాత మరో రెండు తుపానులు వచ్చే ప్రమాదం ఉందని కొద్దిరోజుల కిందటే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనుకున్నట్లుగానే మరో తుఫాను ప్రమాదం పొంచి ఉంది. 
 
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. మంగళవారం సాయంత్రానికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తుఫానుగా మారితే దీన్ని 'బురేవి' అని పిలవనున్నారు.
 
ఈ తీవ్ర వాయుగుండం కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు, ఆగ్నేయ దిశగా 500 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపానుగా బలపడిన అనంతరం డిసెంబరు 2న ట్రింకోమలీ వద్ద తీరం దాటనుంది. 
 
రాగల 24 గంటల్లో తమిళనాడులోని పలు ప్రాంతాలు, కేరళ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. డిసెంబరు 3న తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, కేరళలో 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలోని అధికారులు అప్రమత్తం అయ్యారు.