గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (08:29 IST)

తమిళనాడుకు మరో వాయు'గండం' - రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్

తమిళనాడు రాష్ట్రాన్ని మరో అల్పపీడనం చుట్టుముట్టనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుందని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఈ వాయుగుండం ప్రభావంతో  డిసెంబరు 2న అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఆదివారం మరింతగా బలపడిన విషయం తెల్సిందే. ఇది సోమవారం వాయుగుండంగా మారనుంది. 
 
దీని ప్రభావంతో రేపు సముద్ర తీర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడనుండగా, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఇది 'బురేవి' తుఫానుగా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెండు రోజుల ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, నివర్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం తమిళనాడుకు కేంద్ర బృందం రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్‌ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడుగురు అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ కానుంది.