1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (15:09 IST)

ఏడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్ సైక్లోన్ : ఎయిర్‌పోర్టులు మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ఇపుడు ఏకంగా ఏడు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కోస్తా జిల్లాలకు అపార నష్టం కలిగింది. పూర్బా మెడిని పూర్, సౌత్ 24 పరగణాల జిల్లాలు ఈ తుఫానుతో అతలాకుతలమయ్యాయి. ఈ జిలాల్లో సముద్రపుటలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 
 
ఈ తుఫాను బీభత్సం ధాటికి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం రాత్రి 7.30 గంటలకు మూసివేశారు. ముందు జాగ్రత్తగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 11.5 లక్షల మంది లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 
 
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు అనేక వంతెనలు కూలిపోయాయి. గంటకు 100 నుంచి 110 కి.మీ.వేగంతో వీచిన పెను గాలులలకు భారీ వృక్షాలు నేలకూలగా… వేలాది ఇళ్ళు దెబ్బ తిన్నాయి. హల్దియా పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. 
 
సహాయక చర్యలకు నేవీ, సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. ఒరిస్సాలో సుమారు 6 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్టును గురువారం ఉదయం వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇక బీహార్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ అంచనావేసింది.
 
అదేవిధంగా ఝార్ఖండ్ రాష్ట్రాన్ని బుధవారం సాయంత్రానికి తుఫాను తాకవచ్చునని, ఫలితంగా ఇక్కడ కూడా ఒక మోస్తరు నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మరోవైపు, ఒడిశాలోని బాలాసోర్ వద్ద యాస్ సైక్లోన్ సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది.