శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (16:42 IST)

గుజరాత్‌లో కళ్లకు గాగుల్స్ గ్లాస్ పెట్టుకున్నాడని దళిత యువకుడిపై దాడి..

Boy Attacked
Boy Attacked
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్‌లో ఓ దళిత యువకుడిపై దాడి జరిగింది. కళ్లకు గాగుల్స్ గ్లాస్ పెట్టుకున్నాడని, ఖరీదైన దుస్తులతో మంచిగా డ్రెస్ చేసుకున్నందుకు కొందరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి ఏడుగురిపై కేసు నమోదైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పలన్‌పూర్ తాలూకాలోని మోతా గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఒకడు మంచి దుస్తులు ధరించి, కళ్లకు చలువ అద్దాలు పెట్టుకుని ఇంటి బయట నిల్చొన్నాడు. అది గమనించిన ఆ ప్రాంతానికి చెందిన అగ్రవర్ణ కులానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆ దళిత యువకుడిని పట్టుకుని చావబాదారు. ఈ మధ్య బాగా ఎదుగుతున్నావ్ అంటూ పరుష పదజాలంతో దూషిస్తూ బెదిరించి వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ దాడికి తెగబడ్డారు. తన కుమారుడిపై జరుగుతున్న దాడిని చూసిన కన్నతల్లి, దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను ఈడ్చిపడేశారు. ఆమె దుస్తులు కూడా చింపేసి చంపేస్తామని బెదిరించారు. ఈ మూర్ఖుల దాడిలో తల్లీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కానీ, అగ్రవర్ణ వర్గానికి చెందిన వారు కావడంతో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు.