శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (10:22 IST)

కులాంత వివాహం చేసుకున్న దళిత యువకుడు... అక్క, తల్లి కళ్ళలో కారం చల్లి దాడి..

victim
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ దళిత యువకుడి అక్క, తల్లిపై దాడి జరిగింది. యువకుడి అక్క, తల్లి కళ్ళలో కారం చల్లి దారుణంగా మారణాయుధాలతో కొట్టారు. అర్థరాత్రి పూట ఈ దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కిందపడిపోయిన వారిని చిత్ర హింసలు పెట్టారు. జిల్లాలోని దర్శి మండలం బొట్లపాలెంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం ప్రకారం, బొట్లపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కామునూరి అనురాధ అనే మహిళకు కుమారుడు సాయిరాం, కుమార్తె మౌనిక ఉన్నారు. సాయిరాం... అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమార్తె భార్గవి ఈ ఏడాది రెండో తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. పోలీసులను కలిసి అమ్మాయి కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని కోరగా, జిల్లా ఎస్పీ అందుకు అంగీకరించారు. 
 
ఆయన ఆదేశాలతో స్థానిక పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఎటువంటి గొడవలు పడకుండా ఉండాలని సూచిస్తూ వారిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయించారు. సాయిరాం, భార్గవి ఊరికి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్లి జీవిస్తున్నారు. పరువు పోయిందనే కక్షను అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. 
 
ఈ క్రమంలో.. మౌనిక, అనురాధ సోమవారం రాత్రి 12 గంటల సమయంలో కౌళాయి వద్ద నీళ్లు పట్టుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి అతని భార్య పుల్లమ్మ అక్కడకు వెళ్లి వారిపై కారం చల్లారు. బ్రహ్మారెడ్డి ముందుగా ఆనురాధను కాళ్లు చేతులతో కొట్టాడు. అతని బారి నుంచి ఆమె తప్పించుకుని అక్కడి నుంచి పరిగెత్తింది. తప్పించుకోలేకపోయిన మౌనికను బ్రహ్మారెడ్డి కింద పడేసి గుండెలపై కూర్చొని కత్తితో పొడవబోయాడు. ఆమె చేతులు అడ్డం పెట్టడంతో గాయాలయ్యాయి. 
 
అసభ్యపదజాలంతో మౌనికను తిడుతూ బ్రహ్మారెడ్డి తన ఇంటికి లాక్కెళ్లి కాళ్లు చేతులు కట్టేసి, గొడ్డలితో దాడిచేశాడు. ఇంతలో దాడి నుంచి తప్పించుకున్న అనురాధ 100కు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తాళ్లతో కట్టేసి ఉంచిన మౌనికను విడిపించారు. పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.