ఉద్యోగులకు 9 రోజులు దీపావళి ఫెస్టివ్ బ్రేక్ - ప్రకటించిన రియల్ ఎస్టేట్ కంపెనీ
ఢిల్లీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిని ప్రకటించింది. దీపావళి ఫెస్టివి బ్రేక్ కింద ఏకంగా వేతనంతో కూడిన తొమ్మిది రోజుల హాలిడేను ప్రకటించింది.
తమ కంపెనీ వృద్ధి కోసం డెడ్‌లైన్స్, టార్గెట్స్ పెట్టుకుని పని చేసే ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇలా మానసికంగా, శారీరకంగా అలసిపోవడం వల్ల కంపెనీ ఉత్పాదకపై ప్రభావం పడుతుందని నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరించారు కూడా. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూపు, ఢిల్లీకి చెందిన పీర్ సంస్థ ఎలైట్ మార్క్ తమ సిబ్బందికి మానసిక ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులోభాగగా, అక్టోబరు 18 నుంచి 26వ తేదీ వరకు ఏకంగా తొమ్మిది రోజుల పాటు సెలవుల రూపంలో దీపావళి గిఫ్టును ఇస్తున్నట్టు ప్రకటించింది.
'ఎప్పుడూ కంపెనీ పనిలో నిమగ్నమై ఉండే పరిస్థితుల్లో.. పాజ్, బ్రేక్, రీకనెక్ట్ చాలా ముఖ్యం. ఇలాంటి పండగ బ్రేకులు అందుకు దోహదం చేస్తాయి. మా వృద్ధికి పాటుపడే వ్యక్తులకు మేం విలువనిస్తాం' అని ఎంబసీ గ్రూపు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మారియా రాజేశ్ అన్నారు. ఈ హాలిడేస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించి, కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. ఈ దఫా బహుమతులతో పాటు సెలవులను కూడా దీపావళి గిఫ్టుగా ఇచ్చింది.
ఈ విషయాన్ని ఎలైట్ మార్క్ సీఈఓ రజత్ గ్రోవర్ ఉద్యోగులకు ఈమెయిల్ పంపి, సెలవుల గురించి వెల్లడించారు. కంపెనీ మెయిల్స్‌కు దూరంగా ఉండండి. విశ్రాంతి తీసుకుంటూ కుటుంబ సభ్యులతో హాయిగా, సంతోషంగా గడపాలని సూచించారు. ఏమాత్రం ఊహించని గిఫ్ట్ అందేసరికి ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు లింక్డన్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. సిబ్బంది శ్రేయస్సుకు విలువనిచ్చే సంస్థలో పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు.