ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
మంచినీళ్లు దాహం వేసినప్పుడు ఎలాబడితే అలా తాగకూడదంటున్నారు వైద్య నిపుణులు. నిలబడి మంచినీళ్లు తాగినప్పుడు కడుపులో, జీర్ణవ్యవస్థలో ఏమి జరుగుతుందనే దానిపై ఆయుర్వేదంలో చెప్పబడిన విషయాలు ఏమిటో తెలుసుకుందాము.
నిలబడి నీరు తాగినప్పుడు, అది ఆహార వాహిక ద్వారా ఎక్కువ వేగంగా, ఒత్తిడితో కడుపులోకి వెళ్తుంది. ఇలా వేగంగా నీరు పడటం వల్ల కడుపులోని గోడలపై ఒత్తిడి పడి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఆమ్లాలు, ఎంజైములు నిలబడి త్వరగా ఎక్కువ నీరు తాగినప్పుడు అవి పలచబడవచ్చు. దీని ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాక, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
నీరు వేగంగా ప్రవేశించడం, జీర్ణరసాలు పలచబడటం వలన అజీర్తి ఏర్పడి, కడుపులో ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. కొందరిలో ఈ పద్ధతి వలన గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు పెరగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వలన, శరీరానికి నీటి ద్వారా, ఆహారం నుండి అందవలసిన ముఖ్యమైన పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుందని కొందరు ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేదం ప్రకారం, నీళ్లు తాగడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటంటే... కూర్చుని మంచినీళ్లు తాగడం. కూర్చొని నీరు తాగినప్పుడు శరీరం, నాడులు రిలాక్స్‌గా ఉంటాయి. ఒకేసారి గడగడా తాగకుండా, నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఈ విధంగా తాగడం వల్ల నీరు జీర్ణవ్యవస్థలోకి నెమ్మదిగా వెళ్తుంది, జీర్ణక్రియకు ఆటంకం కలగదు, శరీరం నీటిని చక్కగా గ్రహిస్తుంది.