శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 నవంబరు 2021 (18:10 IST)

అయోధ్యలో దీపావళి సంబరాలు... ప్రపంచ రికార్డు సృష్టించిన భక్తజనం

అయోధ్యలో దీపావళి సంబరాలు మిన్నంటాయి. ఈ వేడుకల్లో భక్త జనం ప్రపంచ రికార్డును సాధించాయి. ఈ దీపోత్సవం గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించింది. ఈ వేడుకల్లో శ్రీలంక సంస్కృతి బృందం కూడా పాల్గొంది. రేపటి వరకూ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
 
రామ జన్మభూమి అయోధ్యాపురి దీపాల కాంతులతో, లేజర్ లైట్స్ జిగేల్‌మని మెరిసిపోతోంది. దీపావళి పండగ సందర్భంగా దివ్వెల వెలుగుల్లో కాంతులీనుతోంది. అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించింది. గతేడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును బ్రేక్‌‌ను చేసింది. బుధవారం సాయంత్రం సరయూ నది ఒడ్డున రామ్‌కీ ఫైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలను వెలిగించి సరికొత్త చరిత్రను సృష్టించింది. 
 
దీపావళికి ఒకరోజు ముందు దీపోత్సవాన్ని యూపీ సర్కార్‌ నిర్వహించింది. రంగురంగుల రంగవల్లులు, విద్యుత్‌ దీపాలు, లేజర్‌ షోలు, లక్షలాది ప్రమిదలతో అయోధ్య దగదగలాడింది. ఇంద్ర ధనస్సులోని రంగుల కలబోతతో రామమందిరం అందంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.