చిక్కిశల్యమైన కెప్టెన్ విజయకాంత్, కన్నీటి పర్యంతమైన కార్యకర్తలు
తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ కాంత్. ఆ తర్వాత ఆయన డీఎండికె పార్టీని స్థాపించారు. అనంతరం అనేక ఆటుపోట్లకు గురయ్యారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్నుంచి ఆయన పార్టీ ఎన్నికల్లో అంత ప్రభావం చూపించడంలేదు. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో డీఎండీకె వర్కింగ్ కమిటీ, జనరల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పాల్గొన్నారు.
డీఎండీకె జనరల్ సెక్రటరీగా ప్రేమలత విజయకాంత్ నియమితులయ్యారు. ఈ సమావేశంలో 15 తీర్మానాలను ఆమోదించారు. వాటిలో విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు సమావేశానికి హాజరైన విజయ్ కాంత్ చిక్కిశల్యమై కనిపించారు. కుర్చీలో తనకు తానుగా కూర్చునే స్థితి కనబడలేదు. ముందుకు పడబోతున్న ఆయనను వెనుక వున్న కార్యకర్తలు గట్టిగా పట్టుకున్నారు. ఈ సన్నివేశాలను చూసిన కార్యకర్తలు కన్నీటిపర్యంతమయ్యారు.