గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (23:23 IST)

నటుడు విజయ్ కాంత్ ఆరోగ్యం క్రిటికల్

Vijayakanth
తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి దిగజారినట్లు ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. అనారోగ్యంతో ఈ నెల 18న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు బుధవారం నాడు ఆయనకు చికిత్స అందిస్తున్న మియోట్ హాస్పిటల్ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారం గత 24 గంటల్లో విజయ్ కాంత్ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని వారు తెలిపారు.
 
విజయకాంత్ 14 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం వుండవచ్చని వారు తెలిపారు. వారం రోజుల క్రితం ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్‌లో, విజయకాంత్ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం స్థిరంగా వున్నదనీ, తన పనులు తను చేసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్లి తన సాధారణ కార్యకలాపాలను కొనసాగించే అవకాశం కూడా వుందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ఆరోగ్యం దిగజారిందని తెలిపారు.
 
దీనితో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. కెప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే విజయకాంత్ సొంత రాజకీయ పార్టీని స్థాపించి 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తమిళనాడులో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలిపి 29 స్థానాలను గెలుచుకున్నారు. డిఎంకెను మూడవ స్థానానికి నెట్టివేయడమే కాకుండా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించారు. ఆ తరువాతి ఎన్నికలలో వరుస పరాజయాలను చవిచూస్తూ ఆయన పార్టీ పతనమైంది. దీనికితోడు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది.