శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:32 IST)

లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఆ వార్తలు నమ్మొద్దు: కేంద్రం

లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితిపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దు.  పేదలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటివరకు లక్ష మందికి కరోనా పరీక్షలు చేయించాం. కరోనా చికిత్స కోసం ఆస్పత్రులను రెండు విధాలుగా విభజించాం.

కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తాం. కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తాం. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న బాధితులకు ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తాం’’ అని వివరించారు.
 
మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలంటూ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఆర్ధిక వ్యవస్థను నెమ్మదిగానైనా చక్కదిద్దుకోవచ్చని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ప్రస్తుతం ముఖ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.

లాక్‌డౌన్ దశలవారీగా ఎత్తెయ్యాలని, ఒక్కసారిగా ఎత్తేయడం సరికాదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. లాక్‌డౌన్ మరో రెండు వారాలు కొనసాగించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె డిమాండ్ చేశారు. రాష్ట్రాల వినతులపై కేంద్రం సానుకూలంగా స్పందించి లాక్‌డౌన్ కొనసాగించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.