సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:27 IST)

లాక్‌డౌన్‌లో అలసత్వం: ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్

భారత్‌లో కరోనా వైరస్‌ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లపైకి వస్తున్నారు.

దీంతో దిల్లీలోని పలుప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. దీనిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితికి కారణమైన దిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు ఉన్నతాధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ కాలంలో ఆంక్షలను అమలు చేయడంతోపాటు ప్రజారోగ్య సంరక్షణలో వీరు అలసత్వం ప్రదర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దిల్లీ రవాణాశాఖ అదనపు ముఖ్యకార్యదర్శితో పాటు ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలపై వేటు వేసినట్లు వెల్లడించింది.

వీరితోపాటు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి, సీలంపూర్‌ సబ్‌-డివిజినల్‌ మెజిస్ట్రేట్‌లను షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ యాక్ట్‌-2005 ప్రకారం ఏర్పడ్డ నేషనల్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటి ఇచ్చే సూచనలను ఉన్నతాధికారులు తప్పక పాటించాల్సి ఉంటుంది.

ఈ కమిటికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమలుపరచడంలో ఈ అధికారులు అలసత్వం ప్రదర్శించినట్లు కమిటి నిర్ధారించింది. అనంతరం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం వీరిపై వేటు వేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1071 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 29 మంది మరణించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.