మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)
గుజరాత్ హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మద్యం మత్తులో కారును నడిపిన ఓ టీచర్... ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా కిలో మీటరుకు పైగా అలానే ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియోను చూసిన వారంతా ఆ టీచర్‌ను ఏకిపారేస్తున్నారు. అతనికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహిసాగర్ జిల్లాలోని మోడాసా-లూనావాడ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మనీశ్ పటేల్ అనే ఉపాధ్యాయుడు తన సోదరుడు మెహుల్ పటేల్‌తో కలిసి మద్యం తాగి కారులో ప్రయాణిస్తున్నాడు.
ఈ క్రమంలో దినేశ్‌భాయ్ (50), సునీల్ (21) అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టి.. బైకును అలానే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన 33 సెకన్ల వీడియోలో, కారు కింద బైక్ చిక్కుకుని ఉండటం, ఓ వ్యక్తి కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కారు నడిపిన టీచర్ మనీశ్ పటేల్‌ను, అతడి సోదరుడు మెహుల్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. వారి కారు నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం లూనావాడ, గోధ్రా సివిల్ ఆసుపత్రులకు తరలించారు.
మనీష్, మెహుల్ ఇద్దరినీ సంఘటనా స్థలంలోనే అరెస్టు చేసినట్లు డివైఎస్పి కమలేష్ వాసవా ధృవీకరించారు. వీరిద్దరి
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని, విద్యా శాఖకు శాఖాపరమైన విచారణను సిఫార్సు చేయడంతో సహా పోలీసులు కఠినమైన చర్యలు ప్రారంభించారు. మద్యం సేవించి ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు నిందితులు ఇద్దరూ పూర్తి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారని డివైఎస్పి వాసవా తెలిపారు.