ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (14:06 IST)

అమ్మను చికిత్స కోసం విదేశాలకు తరలించాలని మొత్తుకున్నా.. ప్చ్.. పట్టించుకోలేదు!

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్య సేవల కోసం విదేశాలకు తరలించాలని ఎంతగానో మొత్తుకున్నాననీ కానీ తన మాట ఎవరూ పట్టించుకోలేదని ఆ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన వైద్య సేవల కోసం విదేశాలకు తరలించాలని ఎంతగానో మొత్తుకున్నాననీ కానీ తన మాట ఎవరూ పట్టించుకోలేదని ఆ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు చెప్పుకొచ్చారు. జయలలిత మృతిపై అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ ఎదుట ఆయన హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
 
ఆరు నెలల క్రితం ఇచ్చిన ఈ వాంగ్మూలం విషయాలు తాజాగా లీకయ్యాయి. ఈ లీకులను గురువారం ప్రముఖ తమిళ పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అనారోగ్యంతో జయ ఆసుపత్రిలో చేరిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను విదేశాలకు తరలించాలని తాను సూచించినట్టు చెప్పారు. తన ప్రతిపాదనకు మంత్రులు తొలుత అంగీకరించినా, తర్వాత పక్కన పెట్టేశారని చెప్పారు. విదేశాలకు తరలించాలా? వద్దా? అన్న దానిపై నాలుగు రోజులు ఆలోచించిన తర్వాత తన సూచనను పక్కన పెట్టేశారని కమిషన్‌కు ఆయన తెలిపారు. 
 
దీంతో స్పందించిన కమిషన్.. మంత్రులు మరెవరి ఆదేశాల కోసమైనా ఎదురుచూశారా? అన్న ప్రశ్నకు రామ్మోహనరావు తనకు తెలియదని వెల్లడించారు. జయ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డిసెంబరు 4, 2016న వైద్యులు ప్రకటించగానే తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లానని, శ్వాస తీసుకోవడంలో జయ ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించానని తెలిపారు. ఆ రాత్రే ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారని, ఆ సమయంలో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారని రామ్మోహనరావు కమిషన్‌కు వివరించారు.