సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (10:39 IST)

అచేతన స్థితిలో అమ్మ.. పక్కనే పేపర్లు పెన్ను... జయ డ్రైవర్ వాంగ్మూలం

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఆమె కారు డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించారు. తాను గదిలోకి వెళ్లేసమయానికి అమ్మ అచేతన స్థితిలో పడివున్నారనీ, ఆమె పక్కన అనేక పేప

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఆమె కారు డ్రైవర్ సంచలన విషయాలు వెల్లడించారు. తాను గదిలోకి వెళ్లేసమయానికి అమ్మ అచేతన స్థితిలో పడివున్నారనీ, ఆమె పక్కన అనేక పేపర్లు, మూత తీసివున్న పెన్ను ఉందని వెల్లడించారు. దీంతో జయలలిత మృతి కేసు సరికొత్త మలుపులు తిరగనుంది. ఈ కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఓ ఆంగ్లపత్రిక లీక్ చేసింది. ఇది ఇపుడు సంచలనంగా మారింది.
 
జయలలిత మృతిపై జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ విచారణ కమిషన్ ఎదుట అమ్మ వ్యక్తిగత డ్రైవర్ కన్నన్ హాజరై పలు విషయాలను పూసగుచ్చినట్టు వెల్లడించారు. మార్చి 6న కమిషన్ ఎదుట హాజరై ఇచ్చిన వాంగ్మూలాన్ని తాజాగా ఓ ఆంగ్ల పత్రిక బహిర్గతం చేసింది.  
 
తాను అమ్మ గదిలోకి వెళ్లే సరికి కుర్చీలో జయ అచేతన స్థితిలో ఉన్నారని, ఆమె పక్కనే కొన్ని ఫైళ్లు, మూతలేని పెన్ను పడి ఉన్నాయని పేర్కొన్నారు. తనను చూసిన శశికళ వెంటనే ఓ కుర్చీ తీసుకు రమ్మన్నారని తెలిపారు. కుర్చీ కోసం తాను వెళ్లే లోపే ఆమె పడిపోతున్నట్టు అనిపించడంతో స్ట్రెచర్ తీసుకురావాలని అనుకున్నట్టు చెప్పారు.  
 
జయలలిత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ రాత్రి 8:30 గంటల సమయంలో పొయెస్ గార్డెన్‌లో కనిపించారని, తర్వాత మళ్లీ గంటపాటు ఆయన జాడలేదని పేర్కొన్నారు. రాత్రి 9:30 గంటలకు మళ్లీ కనిపించిన ఆయన జయతోపాటు ఆసుపత్రికి వెళ్లలేదన్నారు. జయ వెంట శశికళ, వీరపెరుమాళ్ మాత్రమే ఉన్నారని వెల్లడించారు. 
 
శివకుమార్ ఆ గంట సేపు ఎక్కడికి వెళ్లారు? ఏమయ్యారు? అన్న విషయాన్ని శశికళ కానీ, వైద్యుడు కానీ తమ వాంగ్మూలాల్లో వెల్లడించక పోవడం గమనార్హం. జయలలిత వ్యక్తిగత డ్రైవర్ అయిన కన్నన్ ఇచ్చిన ఈ వాంగ్మూలం జయ మృతి కేసులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 
 
శశికళ, శివకుమార్ ఇద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలు ఒకలా, కన్నన్ ఇచ్చిన వాంగ్మూలం వారికి పూర్తి విరుద్ధంగా ఉండడం, జయలలిత పక్కన కొన్ని పేపర్లు, పెన్నూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.