ఫేస్‌బుక్ ప్రేమ.. భార్యాభర్తలు ఆత్మహత్య.. చివరికి ఆ యువకుడు కూడా?
సోషల్ మీడియా ప్రభావంతో ఎంత మంచి జరుగుతుందో పక్కనబెడితే.. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల నేరాల సంఖ్య బాగానే పెరిగిపోతోంది. తాజాగా ఓ సంసారంలో ఫేస్‌బుక్ చిచ్చుపెట్టింది. ఫేస్‌బుక్ ప్రేమ
సోషల్ మీడియా ప్రభావంతో ఎంత మంచి జరుగుతుందో పక్కనబెడితే.. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల నేరాల సంఖ్య బాగానే పెరిగిపోతోంది. తాజాగా ఓ సంసారంలో ఫేస్‌బుక్ చిచ్చుపెట్టింది. ఫేస్‌బుక్ ప్రేమ ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇప్పటికే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా ఈ వ్యవహారానికి బాధ్యుడిగా అనుమానిస్తున్న యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. జంగారెడ్డి గూడెంలో విషాదం చోటుచేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం ముగ్గురి చావుకు కారణమైంది.
వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే, బిందు భర్త సాయికి ఫోన్ చేసిన మురళి బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని బెదిరించాడు. మురళి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు గోదారిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
భార్యాభర్తల మరణాలపై పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్యాభర్తల ఆత్మహత్య కేసు తన మెడకు చుట్టుకుంటుందని మురళి జడుసుకున్నాడు. పోలీసుల విచారణకు భయపడిన మురళి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.