మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి ఇకలేరు..
శివసేన పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని పీడీ హిందుజా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మనోహర్ జోషి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు గురువారం సాయంత్రమే ప్రకటించాయి. కాగా, గత యేడాది మే నెలలో మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంబారినపడుతూనే ఉన్నారు.
కాగా, శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్ కూడా వ్యవహరించారు. 1937 డిసెంబరు 2వ తేదీన నాంధ్వీలో జన్మించిన జోషి.. విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది. సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. స్టాండింగ్ కమిటీ (మున్సిపల్ కార్పొరేషన్) చైర్మన్‌గానూ వ్యవహరించారు. 1967-77 మధ్య ముంబై మేయర్‌గా పనిచేశారు. 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరపున ముంబై నార్త్ - సెంట్రల్ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.