శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (13:34 IST)

యూపీలో ఆసక్తికర పరిణామం .. బీజేపీలో చేరిన ములాయం కోడలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. దీంతో అనేక మంది వలస నేతలు తమకు నచ్చిన పార్టీలోకి మారుతున్నారు. ఇప్పటికే ఇద్దరు యూపీ మంత్రులు బీజేపీకి రాజీనామా చేసి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. మరికొందరు నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. 
 
ఎస్పీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ కోడలు ఇపుడు కాషాయం కండువా కప్పుకున్నారు. ములాయం సింగ్ రెండో భార్య తనయుడైన ప్రతీక్ యాదవ్ కుమారుడు భార్య అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అపర్ణ యాదవ్ మాట్లాడుతూ, తాను భారతీయ జనతా పార్టీకి ఎంతగానో రుణపడి ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును ఆమె కొనియాడారు. ఇదిలావుంటే, గత ఎన్నికల్లో లక్నో స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అయితే, ప్రస్తుతం రీటా బహుగుణ ఎంపీగా కొనసాగుతున్నారు.