గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (13:26 IST)

ఎన్నికల వేళ రైతులకు యూపీ సీఎం యోగి వరాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను శనివారం జారీచేసింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతులపై వరాల జల్లు కురిపించారు. 
 
వ్యవసాయ వినియోగ విద్యుత్‌ చార్జీలను సగానికి తగ్గించారు. పట్ణాల్లో బోరుబావుల కనెక్షన్లకు సంబంధించి ప్రస్తుతం యూనిట్‌కు 6 రూపాయలు వసూలు చేస్తుండగా, దీన్ని మూడు రూపాయలకు తగ్గించారు. 
 
అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోని పంపుసెట్ల విద్యుత్ చార్జీలు కూడా రెండు రూపాయల నుంచి ఒక్క రూపాయికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పట్టణాల్లో ఫిక్స్‌డ్ చార్జీలను తగ్గించారు. హార్స్ పవర్‌కు ఇప్పటివరకు రూ.130 వసూలు చేస్తుండగా, దానిని రూ.65కు తగ్గించారు. 
 
గ్రామాల్లో ఇది రూ.70గా ఉంటే రూ.35కు తగ్గించారు. ఇక మీటర్లు లేని కనెక్షన్ల హార్స్‌ పవర్ రేటును రూ.170 నుంచి రూ.85కు తగ్గిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీశారు.