గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆధార్ కార్డులు ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు : కేంద్రం ఆదేశం

e-aadhaar
ఇపుడు ప్రతి దానికీ ఆధార్ కార్డు ఆధారమైపోయింది. ఎలాంటి ఫ్రూఫ్ కావాలన్న ఆధార్ కార్డును అడుగుతున్నారు. అయితే, ఎక్కడపడితే అక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని ఇస్తుంటారు. అయితే, ఎవ్వరికి పడితే వారికి ఆధార్ జిరాక్స్ కాపీలను ఇవ్వవద్దని కేంద్రం హెచ్చరిస్తోంది. 
 
అవును, ఏ వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వకూడదని, ఇస్తే దానిని దుర్వినయోగం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సూచించింది. ఈ నెల 27న దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. 
 
ఆధార్‌ను జారీ చేసే యూఐడీఏఐ లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే వివిధ వ్యక్తుల సమాచారం పొందేందుకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. లైసెన్స్ లేని హోటళ్లు, సినిమా హాళ్లు, ఇతర ప్రైవేటు సంస్థలు వ్యక్తుల ఆధార్ కార్డుల జిరాక్స్‌ను తీసుకునేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది. 
 
ఏ సంస్థ అయినా ఆధార్ కోసం డిమాండ్ చేస్తే సదరు సంస్థకు యూఐడీఏఐ నుంచి లైసెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. అంతగా కావాలని పట్టుబడితే యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ‘మాస్క్ డ్ ఆధార్ కార్డ్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఏంటీ మాస్క్డ్ (Masked Aadhaar) ఆధార్?
 
మామూలుగా 12 అంకెల యూనిక్ ఐడీతో ఆధార్ కార్డును ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ Masked Aadhaar లో చివరి నాలుగు అంకెలను మాత్రమే చూపిస్తారు. 
 
https://myaadhaar.uidai.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి.. ఈ ఆధార్ డౌన్ లోడ్ సెక్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ‘మాస్క్డ్ ఆధార్ కావాలా?’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్డ్ ఆధార్ ను పొందవచ్చు.