రైతులకు తీపి కబురు చెప్పిన ప్రధాని మోడీ : ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత!!
దేశంలోని ఉల్లి రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860గా నిర్ణయించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో ఉత్తి ఎగుమతి ధర 500 డాలర్లుగా పేర్కొనడం జరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు మేలు జరగనుంది.
ఇక విదేశాలకు ఉల్లి ఎగుమతిపై పూర్తి నిషేధం విధించిన కేంద్ర సర్కార్.. శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ వంటి దేశాలకు మాత్రం పరిమితులతో కూడిన ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి రైతులు, వ్యాపారులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఉల్లి రైతులు ఈ డిమాండ్ను గట్టిగా వినిపించారు. అయితే, దేశంలో ఉల్లి ధరలు పెరుగుతాయనే కారణంతో ప్రభుత్వం నిషేధాన్ని అలాగే కొనసాగించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 'దేశీ చనా' (బెంగాల్ గ్రామ్) ఉత్పత్తులు తగ్గిపోవడంతో వీటికి వచ్చే ఏడాది మార్చి వరకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఇచ్చింది. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో వీటి ధర క్వింటాల్‌కు రూ.5,700తో పోలిస్తే 10 శాతం పెరిగి సుమారు రూ.6,300కి చేరింది. అలాగే పసుపు బఠానీ దిగుమతి సుంకంపై ఇదివరకే జారీ చేసిన బిల్లు గడువు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు పొడిగించింది.