శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (13:00 IST)

పెళ్లికి ముందే హెచ్.ఐ.వి టెస్ట్ చేయిస్తే తప్పేంటి : గోవా మంత్రి

పెళ్లికి ముందే హెచ్.ఐ.వి టెస్ట్ చేయిస్తే తప్పేంటి అని గోవా మంత్రి వరకు ప్రశ్నిస్తున్నారు. ఆయన పేరు విశ్వజిత్ రాణే. గోవా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సాగుతోంది. అందుకే మంత్రిగారు ఈ తరహా ప్రతిపాదన చేశారు. గోవా రాష్ట్రంలో పెళ్లి రిజిస్ట్రేషన్‌కు ముందే హెచ్.ఐ.వి టెస్ట్ చేయించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన ఓ ప్రతిపాదన చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పెళ్లికి ముందు వధూవరులిద్దరికి హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునే పద్ధతి అమలును పరిశీలించాలని తాను న్యాయశాఖను కోరామని ఆరోగ్య మంత్రిగా ఉన్న విశ్వజిత్ తెలిపారు. పెళ్లికి ముందు హెచ్ఐవీ పరీక్షలు జరిపించుకునేలా ప్రజాఆరోగ్య చట్టంలో ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణలు తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
 
గోవాలో 1987 నుంచి ఇప్పటివరకు 17,122 మంది రోగులకు హెచ్ఐవీ సోకిందని తేలినందున ఈ నిర్ణయం తీసుకోనున్నామని  మంత్రి వివరించారు. దీంతోపాటు తలసీమియాతో బాధపడే పిల్లలు పుట్టకుండా ఉండాలంటే పెళ్లికి ముందు తలసీమియా పరీక్ష కూడా చేయించుకోవాలని మంత్రి సూచించారు.