కోవిడ్ రోగులకు వెంటిలేటర్ కాదు.. ఆక్సిజనే ప్రాణాధారం...
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి పీక్ స్టేజీకి చేరుకుంది. దీనికి నిదర్శనమే కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరడం. అదేసమయంలో ప్రస్తుతం ఈ వైరస్ బారినపడుతున్న రోగులకు ఇపుడు ఎక్కువగా ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కరోనా సెకండ్ వేవ్ పై ఆసక్తికర అంశాలు వెల్లడించింది.
కొత్తగా వెల్లడవుతున్న కేసుల్లో 70 శాతం 40 ఏళ్లకు పైబడినవారే ఉంటున్నారని తెలిపింది. గతేడాదితో పోల్చితే అత్యధికంగా కరోనా బారినపడుతున్న వారి వయసుల్లో పెద్దగా వ్యత్యాసం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. అయితే కరోనా 2.0లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం బాగా పెరిగిందని తెలిపారు.
అదేసమయంలో, మొదటి విడతతో పోల్చితే ఈ దఫా వెంటిలేటర్ల వాడకం తగ్గిందని చెప్పుకొచ్చారు. కరోనా మొదటి తాకిడి సందర్భంగా 41.5 శాతం మందికి ఆక్సిజన్ అవసరం కాగా, రెండో తాకిడిలో 54.5 శాతం ఆక్సిజన్ అవసరం ఏర్పడుతోందన్నారు. గతంలో లక్షణాలు లేని రోగుల సంఖ్య తక్కువగావుంటే, ఇప్పుడు అలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.